Tirumala Electric Bus Robbery Accused తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఓ యువకుడు బస్సును ఎత్తుకెళ్లాడు. కొండపై నుంచి దర్జాగా బస్సును తీసుకెళ్లాడు. ఈ ఘటన అప్పట్లో కలకలంరేపింది. తర్వాత ఆ బస్సును నాయుడుపేట దగ్గరలో గుర్తించగా.. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.
తిరుమలలో శ్రీవారి ధర్మ రథం ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అంజనాపుర్ గ్రామానికి చెందిన నీలావర్ విష్ణుకి మూడు నెలలు జైలుశిక్ష విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి పల్లపోలు కోటేశ్వరరావు మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది సెప్టెంబరు 24న ఎలక్ట్రిక్ బస్సుని తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో ఛార్జింగ్‌లో పెట్టి ఉండగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
తిరుమలలో సెప్టెంబర్ నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఈ చోరీ ఘటన జరిగింది. భక్తుల కోసం కొండపై ఏర్పాటు చేసిన ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును విష్ణు ఎత్తుకెళ్లాడు. తిరుమలలో ఉన్న బస్టాండ్‌లో ఛార్జింగ్‌లో ఉన్న సమయంలో తీసుకెళ్లాడు. ఈ బస్సుల్లో జీపీఎస్ లొకేషన్ ఉంది.. దీని ఆధారంగా ఆ బస్సును నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లి పారిపోయినట్లు గుర్తించారు.
విష్ణు ఆ రోజు తెల్లవారుజామున 3:53 గంటలకు జీఎన్‌పీ వద్ద ఘాట్ రోడ్డులోకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. వెంటనే తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు నాయుడుపేట నుంచి చెన్నై మీదుగా తీసుకెళ్లగా.. గస్తీలో ఉన్న పోలీసులను గమనించి బస్సును రోడ్డుపై వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. అతడ్ని కొద్దిరోజులకే తిరుపతి బస్టాండ్ సమీపంలో నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.